Current Date: 15 Nov, 2024

యువతిని కాపాడి మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. తన మానవత్వం చాటుకున్నారు. ఆపద కాలంలో ఓ యువతి ప్రాణాన్ని కాపాడారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి లారీ కిందికి దూసుకెళ్లి ప్రమాదకర పరిస్థితిలో ఇరుక్కుపోయింది. లారీ టైరు కింద ఆమె జుట్టు ఇరుక్కుపోవటంతో.. బయటకు రాలేని క్షిష్టపరిస్థితి నెలకొంది. లారీని ముందుకో వెనక్కో కొంచెం జరిపినా ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లే ప్రమాదం. అదే సమయంలో.. అటుగా వెళ్తున్న బండి సంజయ్ కుమార్.. ఆ ప్రమాదాన్ని గమనించి.. సమయస్ఫూర్తితో ఆలోచించి.. ఆ యువతిని కాపాడారు. అటువైపు వెళ్తున్న లారీలను ఆపి జాకీలు, కత్తెరలు తెప్పించి దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. లారీ కింద నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత బాధితురాలికి ధైర్యం చెబూతూ అదే మార్గంలో వెళ్తున్న ఓ కారును స్వయంగా ఆయనే ఆపి.. అందులో బాధితురాలిని ఎక్కించి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

Share