Current Date: 01 Apr, 2026

ఫస్ట్ మ్యాచ్‌లోనే చిత్తుగా ఓడిన చెన్నై.. మాజీ ప్లేయరే ముంచాడు

ఐపీఎల్ 2026లో బ్యాటర్ల జోరుకు బ్రేక్ పడింది. గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలర్లు చెలరేగడంతో చెన్నై 127 పరుగులకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరూ 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. చివర్లో జేమీ ఒవర్టన్ (43) మెరుపులు మెరిపించడంతో సీఎస్కే ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో సులువుగా విజయాన్ని అందుకుంది. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన సూర్యవంశీ  4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఛేదన చేసిన జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో జట్లు మారిన కీలక ఆటగాళ్ల ప్రదర్శన ఆసక్తికరంగా సాగింది. రాజస్థాన్ జట్టును వీడి చెన్నైలో చేరిన సంజు శాంసన్ తన మాజీ జట్టుపై తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు, సుదీర్ఘ కాలం చెన్నైకి ఆడి తిరిగి రాజస్థాన్ గూటికి చేరిన రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. తన తొలి ఓవర్లోనే సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే వంటి కీలక వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించాడు. పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను కార్తీక్ జారవిడవడం కూడా చెన్నై ఓటమికి ప్రధాన కారణమైంది.