హైదరాబాద్ ఐఎస్‌బీ క్యాంపస్‌లో తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో, నిందితుడికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ 40 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం.. ఉభయుల వయస్సును పరిగణనలోకి తీసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
2023 మే 30న ఐఎస్‌బీ క్యాంపస్‌లోని స్టూడెంట్ అపార్ట్‌మెంట్‌లో ప్రథమ్ సింగ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు సదరు మహిళ 2025 డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ సెక్షన్లు 351(2), 69 కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు ప్రథమ్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఇద్దరి మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన (కన్సెన్సువల్) సంబంధాలు ఉన్నాయని, రెండున్నరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు.
కేసు దర్యాప్తు దాదాపు పూర్తికావడం, ఫిర్యాదులో తీవ్ర ఆలస్యం జరగడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు 2026 మే 29న నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి స్పందిస్తూ ‘పిటిషనర్ వయసెంత’ అని ప్రశ్నించారు. నిందితుడికి 38, పిటిషనర్‌కు 40 ఏళ్లు అని న్యాయవాది బదులివ్వగా... జస్టిస్ మెహతా ‘థాంక్యూ.. డిస్మిస్’ అని ప్రకటించారు.