Current Date: 05 Oct, 2024

నీట్‌ రీ-టెస్టుకు సుప్రీం నిరాకరణ పేపర్ లీక్‌‌కి నో ప్రూఫ్స్!

నీట్‌–యూజీ 2024 రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రద్దు చేస్తే లక్షలాది మంది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. పేపర్‌ లీక్‌ వాస్తవమని, అయితే  వ్యవస్థాగత పేపర్‌ లీక్‌ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేనందున పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదనడానికి అవకాశాల్లేవని స్పష్టం చేసింది. నీట్‌–యూజీ 2024 రద్దుతో వైద్య కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌కు అంతరాయం, వైద్యవిద్యపై ఊహించలేని ప్రభావం పడుతుందని, భవిష్యత్‌లో అర్హత కలిగిన వైద్య నిపుణుల లభ్యతపైనా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఇది కొందరు అభ్యర్థులకు ప్రతికూలత అవుతుందని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ఎన్టీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది కౌశిక్, పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు నరేందర్‌ హుడా, సంజయ్‌ హెగ్డే, మాథ్యూస్‌ నెడుంపర, ఇతర న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు వినిపించారు. నీట్‌–యూజీ, 2024పై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. సహేతుకమైన తీర్పు తర్వాత వెలువరిస్తామని తెలిపింది. 

Share