సుప్రీంకోర్టులో మంగళవారం అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయ. నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరుగుతుండగా అడ్డుపడిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సీరియస్ అయ్యారు న్యాయవాది నరేంద్ర హుడా వాదన వినిపిస్తుండగా నెడుంపర అడ్డుపడ్డారు. తాను ‘అమికస్’నని, బెంచ్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తానని చెప్పారు.
దానిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తాను ఏ ఎమికస్‌ను నియమించలేదన్నారు. దాంతో నెడుంపర ‘‘మీరు నాకు గౌరవం ఇవ్వకుంటే. నేను వెళ్లిపోతా’ అన్నారు. అందుకు సీజేఐ ఆగ్రహంతో ‘మిస్టర్ నెడుంపర.మీరు కోర్టు హాల్లో ఉన్నారు. సెక్యూరిటీని పిలవండి. ఆయనను బయటకు పంపిస్తారు’ అని అన్నారు. దాంతో నెడుంపర తానే వెళ్లిపోతా నన్నారు. వెంటనే సీజేఐ ‘ఇలా వెళ్లిపోతానని మీరు చెప్పకూడదు. 24 ఏళ్లుగా జ్యుడీషియరీని చూస్తున్నా. కోర్టులో ప్రొసీడింగ్స్‌ను లాయర్లు డిక్టేట్ చేయరు’ అని పేర్కొన్నారు. నెడుంపర కూడా ‘1979 నుంచి నేనూ జ్యుడీషియరీని చూస్తున్నా’ అనడంతో సీజేఐ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బయటకు వెళ్లిన నెడుంపర కాసేపటికే తిరిగొచ్చి ‘సారీ.. నేనెలాంటి తప్పూ చేయలేదు, అనుచితంగా ట్రీట్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా’’ అని చెప్పారు. నెడుంపర కోర్టు విచారణకు అంతరాయం కలిగించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.
Share