Current Date: 18 Mar, 2026

కాకినాడకు మళ్లీ వచ్చిన పులి.. పాపికొండల్లో వదిలినా దారి మర్చిపోలేదు!

కాకినాడ జిల్లా శంఖవరం, అన్నవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం అటవీశాఖ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. శాటిలైట్‌ రేడియో కాలర్‌ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నప్పటికీ, అది నిరంతరం తన స్థానాన్ని మారుస్తుండటంతో బంధించడం సవాలుగా మారింది. నిన్న అన్నవరం సమీపంలోని జి.కొత్తపల్లి నల్లకొండమ్మ ఆలయం వద్ద కనిపించిన పులి, సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి ప్రస్తుతం శంఖవరం మండలం గౌరంపేట కొండపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులిని పట్టుకునేందుకు అటవీ దళాల అధిపతి డాక్టర్ పీవీ చలపతిరావు పర్యవేక్షణలో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 11 హనుమాన్ బృందాలు, 3 ట్రాంక్విలైజింగ్ (మత్తుమందు ఇచ్చే) బృందాలతో పాటు ప్రత్యేక ఆర్‌ఆర్‌ఆర్‌టీ బృందాలు రంగంలోకి దిగాయి. పులి పశువులను వేటాడుతుండటంతో దానిని బంధించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయని, మత్తుమందు తుపాకీలతో అటవీ సిబ్బంది కొండ చుట్టూ మాటు వేశారని అధికారులు వెల్లడించారు. గతంలో ఈ పులిని పాపికొండల నేషనల్ పార్క్‌లో వదిలినప్పటికీ, పశువుల వేట కోసం ఇది మళ్లీ జనావాసాల్లోకి వస్తోందని అధికారులు తెలిపారు.