Current Date: 27 Nov, 2024

ఉపశమనం లేదు ‘ఉక్కు’పాదమే!

కేంద్ర బడ్జెట్‌లో విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరటనిచ్చే ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. బడ్జెట్‌కు కొద్దిరోజుల ముందు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించినప్పుడు ప్రైవేటీకరణ ఉండబోదని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు హమ్మయ్య.. అనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్టీల్‌ప్లాంట్‌కు మంచి రోజులు వచ్చాయని అంతా సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. బడ్జెట్‌లో ఉక్కు కర్మాగారంపై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడమే కాదు.ప్లాంట్‌ నిలదొక్కుకోవడానికి ఎలాంటి ఉపశమన చర్యలను ప్రకటించలేదు. ముడి సరకు సరఫరాపై గాని, నష్టాల నుంచి గట్టెక్కించే అంశంపై గాని, ప్రత్యామ్నాయ మార్గాలపై గాని మాట్లాడలేదు. దీంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను బతికిస్తారన్న ఆశలు గల్లంతయ్యాయి. తాజా బడ్జెట్‌లో ఈ ఉక్కు కర్మాగారం మూలధన వ్యయం కింద రూ.620 కోట్లను ప్రకటించారు. వాస్తవానికి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చదు. ఏటా స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ప్రొజక్షన్‌ కింద చూపించేదే. అయితే బడ్జెట్‌లో అదేదో కేంద్రం సాయం అందిస్తున్నట్టుగా పేర్కొనడంపై ఉక్కు కార్మికులు మండి పడుతున్నారు. 

Share