తెలుగు సినిమాలు కొన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకుంటుండటంతో, టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో భాగం కావాలని హీరోయిన్లు ఎంతో ఆశపడుతుంటారు. అయితే, ఇటీవల వస్తున్న ఈ భారీ చిత్రాలలో హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం అయిపోతున్నాయి.
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాలో జాన్వి కపూర్ పోషించిన ‘అచ్చియ్యమ్మ’ పాత్ర చుట్టూ కథ నడుస్తుందని, హీరో స్వభావాన్ని మార్చే అత్యున్నతమైన క్యారెక్టర్ అని ముందుగా చెప్పి, చివరికి సినిమాలో ఆమెను చాలా సాధారణంగా మిగిల్చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో జాన్విని కేవలం ఒక వస్తువుగా చూపించారని, అభ్యంతరకరమైన కెమెరా యాంగిల్స్ పెట్టారంటూ బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో భారీగా విమర్శలు చెలరేగాయి. దీనిపై దర్శకుడు స్పందించి కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలగించినప్పటికీ, గతంలో ఆమె నటించిన ‘దేవర-1’లోనూ ఇలాగే గొప్పగా చెప్పి పాత్రను పేలవంగా ముగించారనే అసంతృప్తి అలాగే మిగిలిపోయింది.
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ పరిస్థితి, భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో కియరా అద్వానీ క్యారెక్టర్ కూడా శంకర్ మార్క్ కథా గమనంలో సైడ్ అయిపోయినవే. ఇలా సౌత్ నుంచి వస్తున్న మెజారిటీ పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్లు కేవలం పాటలకే పరిమితమై ‘నామ్ కే వాస్తే’గా మిగిలిపోతుండటం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.