నటి లావణ్య త్రిపాఠి కొణిదెల తనపై, తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు మరియు తప్పుడు కామెంట్లతో వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు మితిమీరిపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన ఆరోపణలు చేస్తున్నారని, కామెంట్ల రూపంలో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నిఘా ఉంచుతామని వారు హెచ్చరించారు.
Share