అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖ ఉక్కుకు బొగ్గును అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఇక స్టీల్‌ప్లాంట్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ఉక్కు సీఎండీ అతుల్‌భట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సుమారు 1000మంది అధికారులు బుధవారం సాయంత్రం పాదయాత్రగా గంగవరం పోర్టు వెనుక గేటు వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. స్లీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్‌భట్ ఈ పాదయాత్రకు అంగీకరించడంతో గంగవరం పోర్టు కార్మికుల్ని బ్రతిమలాడుకుని బొగ్గును ఉక్కుకు తరలించే పనికి ప్రత్యక్ష చర్యకు ఉపక్రమించారు. ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దానిని అమలుపర్చాల్సిన జిల్లా యంత్రాంగం అదానీ పోర్టు జోలికి వెళ్లడానికి ముందుకు రాలేదు. గంగవరం పోర్టు యాజమాన్యంతో కార్మిక నాయకులు జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిరది. కార్మిక సమస్యలు తీర్చే విషయంలో తమకు మరింత సమయం కావాలని అదానీ పోర్టు యాజమాన్యం తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో హైకోర్టు ఉత్తర్వుల్ని అనుసరించి గంగవరం పోర్టులోని ఉక్కుకు చెందిన బొగ్గును కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు రవాణా చేయాల్సి ఉంది. దీనికి గాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున చొరవ తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కలెక్టర్ ఎటువంటి చర్యా తీసుకోలేకపోయారు. మరో పక్క విశాఖ ఉక్కు అవసరమైన బొగ్గు లేక కటకటలాడిపోతోంది. అతి కష్టంమీద కనీస ఉష్ణోగ్రతల్ని నిర్వహిస్తూ సీఎండీ అతుల్‌భట్ టీం ఉక్కును కాపాడుకుంటూ వస్తోంది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఉక్కు ఉత్పత్తి కూడా ఘననీయంగా తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖ ఉక్కు నుంచి గ్యాస్ లీకయ్యే ప్రమాదముందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆఖరి ప్రయత్నంగా సీఎండీ అతుల్‌భట్ అంగీకారంతో ఉక్కు ఉద్యోగులు..పాదయాత్ర ద్వారా సమ్మెలో ఉన్న గంగవరం పోర్టు కార్మికుల్ని కలవడానికి సన్నద్ధమయ్యారు. అయితే ఈ చర్యలకు గంగవరం పోర్టు అర్‌అండ్‌ఆర్ కార్మికులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.