Current Date: 26 Nov, 2024

ఈవీఎంకు హారతి ఇచ్చిన ఎన్సీపీ నేతపై కేసు నమోదు

ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళపై కేసు నమోదు అయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో విడత పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌, ఎన్సీపీ నాయకురాలు రూపాలి చకంకర్‌ మహారాష్ట్ర, ఖడక్‌ వాసలా ప్రాంతంలోని ఓ పోలింగ్‌ బూత్‌కి వెళ్లారు. ఓటు వేసే ముందు ఆమె పోలింగ్‌ బూత్‌ లోని ఓ ఈవీఎంకు హారతి ఇచ్చి పూజలు జరిపారు.
దీనికి సంబంధించిన ఫోటోలు నిట్టింట వైరల్‌గా మారాయి. పోలింగ్‌ బూత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని ఆమెపై ఆ ప్రాంత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో రూపాలీ చకంకర్‌పై పూణేలోని సింహగడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదు చేశారు. 
అలాగే.. బారామతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్‌ బూత్‌లోకి మరికొందరు వ్యక్తులతో అనధికారకంగా ప్రవేశించినందుకు రూపాలి చకంకర్‌పై మరో కేసు నమోదు అయ్యింది. దీనిపై పలు సెక్షన్‌ 188 తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణే నగర పోలీస్‌ కమీషనర్‌ అమితేష్‌ కుమార్‌ తెలిపారు.