Current Date: 05 Oct, 2024

సెల్ఫీ కోసం వ‌చ్చిన‌ అభిమాని మెడ పట్టుకుని ఈడ్చిన స్టార్ క్రికెటర్....

ఆల్‌రౌండ‌ర్‌లకు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఫీల్డ్‌లో అత్యంత కోపిష్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చే పేరు షకీబ్‌దే. కోపంతో ఈయన పలుమార్లు వార్తల్లోకి కూడా ఎక్కాడు. దేశవాళీ లీగ్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై చిర్రెత్తుకుపోవడం, స్టంప్‌లను తన్నేయడం, సెల్ఫీలంటూ వచ్చిన అభిమానుల‌ను తరిమేయడం వంటి విషయాలతో తరచూ వార్త‌ల్లో నిలుస్తుంటాడు షకీబ్.
అయితే షకీబ్ అల్ హసన్ మ‌రోసారి ఓ అభిమానిప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు అభిమానుల‌పై చేయిచేసుకున్న ష‌కీబ్.. ఈసారి ఏకంగా ఓ వ్యక్తి మెడ పట్టుకుని గెంటేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతోంది.  ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. షకీబ్ ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ లీగ్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో టాస్ వేసే ముందు ఓ అభిమాని పరిగెత్తుకుంటూ సెల్ఫీ కోసం షకీబ్ దగ్గరకు వచ్చాడు. కానీ, షకీబ్ అభిమానితో కుదరదని నిరాకరించాడు. అయితే అభిమాని పలుమార్లు అలాగే సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించ‌డంతో కోపం తెచ్చుకున్న షకీబ్ అతని మెడ పట్టుకుని ఈడ్చాడు. దీంతో ష‌కీబ్ తీరు ప‌ట్ల క్రికెట్ అభిమానులు, నెటిజ‌న్లు క‌న్నెర్ర చేస్తున్నారు.