టీడీపీ హయాంలోనే పోలవరం 72 శాతం పూర్తిచేశాం. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకూ నీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.800 కోట్లు ఖర్చవుతుంది, దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది, టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావొచ్చు, గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి, ఈ జిల్లాకు సాగునీరందిస్తే నా జన్మ సార్థకం అవుతుందన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు.
Share