ఆదివాసీలకు ఇంకా డోలీ మోతలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ పిత్రిగడ్డ కొండ శిఖర గ్రామానికి చెందిన కొర్ర దేవి (29)కి నెలలు నిండాయి. ఆమెకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో తెల్లవారుజామున భర్త రమేష్, కుటుంబ సభ్యులు కొర్ర రాజు సహకారంతో డోలీ కట్టించి ఎత్తయిన కొండలపైనుంచి ఆర్ల వరకు 6కి.మీ మేర మోసుకుంటూ వచ్చారు. 108 వాహనానికి ఫోన్ చేయగా, అంబులెన్స్ అందుబాట్లో లేదంటూ సమాధానం వచ్చింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రైవేట్‌గా ఆటో కట్టించుకుని బుచ్చయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు తీసుకు వచ్చారు. తమ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో కలుపుకొని 280మంది జనాభా ఉన్నా మాకీ డోలీమోతలు తప్పడం లేదని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2021లో తాము చందాలు వేసుకుని సొంతంగా రోడ్డు వేసుకున్నామని, అయితే ఆ రోడ్డు ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనువుగా ఉంది తప్పితే పెద్ద వాహనాలకు ఉపయోగపడలేదన్నారు. 2022-23లో ఉపాధి హామీ పథకంలో మట్టిరోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.1కోటి మంజూరైనా పనుల్ని మధ్యలోనే వదిలేశారు. అంతేకాకుండా పనులు పూర్తి చేయించుకుండానే అయినట్టు లెక్కలు చూపించి రూ.26లక్షల్ని అధికారులు తమ జేబుల్లో వేసేసుకున్నారు. గిరిజనులు ఆందోళన చేయడంతో గత జూలైలో ఆగమేఘాల మీద 3కి.మీ మేర పక్కనే ఉన్న మట్టిని తీసి, చిన్న చిన్న పనుల్నే చేసేసి మమ అనేశారని గిరిజనులు వాపోతున్నారు. పల్లె పండుగ పేరిట ఏపీ ప్రభుత్వం హడావుడి చేస్తోందని, కానీ తమ పరిస్థితిలో మాత్రం మార్పులు కనిపించడం లేదంటున్నారు.
Share