Current Date: 27 Nov, 2024

మధ్యప్రదేశ్‌లో దారుణం బతికుండానే మహిళలను పూడ్చేయత్నం

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయగా, స్థానికులు సకాలంలో స్పందించడంతో వారు బతికి బయటపడ్డారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొందరు వ్యక్తులు ట్రక్కులో మట్టి తెచ్చి వారిపై పోసి సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు.  బాధితులను మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు. మంగ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జరోట్ గ్రామంలోని ఓ ప్రైవేటు భూమిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడమే అందుకు కారణమని పోలీసులు తెలిపారు. వారిని మెడల వరకు పాతిపెట్టినట్టు పేర్కొన్నారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి డంపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  భూ తగాదాలే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది.

Share