టీ20 ప్రపంచకప్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న భారత్, బుధవారం నెదర్లాండ్స్‌తో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలు, భారీ నెట్ రన్‌రేట్‌తో ఇప్పటికే సూపర్-8కు చేరిన సూర్యకుమార్ సేన, అజేయంగా ఈ దశను ముగించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, కేవలం ఒకే విజయం సాధించి వెనుకబడిన డచ్ జట్టు ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు ఏ మేరకు సవాలు విసురుతుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఖాతా తెరవని అతను, కీలకమైన సూపర్-8 పోరుకు ముందు లయ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఇషాన్ కిషన్, సూర్యకుమార్, దూబే మంచి ఫామ్‌లో ఉండగా, బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాతో తలపడబోయే అహ్మదాబాద్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో, దీనిని ఒక మంచి ప్రాక్టీస్‌గా భారత్ భావిస్తోంది. నెదర్లాండ్స్‌ను తక్కువ అంచనా వేయలేమని గత మ్యాచ్‌లు నిరూపించాయి. బాస్ డెలీడ్, అకెర్‌మ్యాన్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లతో ఆ జట్టు పటిష్టంగానే ఉంది. భారత్ తన సూపర్-8 ప్రయాణాన్ని ఈ నెల 22న దక్షిణాఫ్రికాతో ప్రారంభించనుంది. ఆ తర్వాత 26న జింబాబ్వే, వెస్టిండీస్‌తో మార్చి 1న తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి దశకు వెళ్లాలని భారత్ యోచిస్తోంది.
Share