ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డర్ చేసిన చిన్న తప్పిదంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లక్నో వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
వాస్తవానికి ఛేదనలో ఢిల్లీ టీమ్ తడబడింది. కానీ.. మిడిల్ ఓవర్లలో జాకీ ఫ్రెషర్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 55 పరుగులతో లక్నోకి మ్యాచ్‌ను దూరం చేశాడు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఫ్రెషర్ ఒత్తిడికి గురై ఫస్ట్‌లోనే సింపుల్‌గా క్యాచ్ ఇచ్చాడు. కానీ.. లక్నో ఫీల్డర్ రవి బిష్ణోయ్ చాలా క్యాజువల్‌గా ఆ క్యాచ్‌ను పట్టబోయి నేలపాలు చేశాడు. ఇక అక్కడి నుంచి వరుస సిక్సర్లు బాదిన ఫ్రెషర్.. నిమిషాల్లో మ్యాచ్‌ను ఢిల్లీ చేతుల్లో పెట్టేశాడు.
సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ టీమ్‌కి ఇది రెండో విజయంకాగా.. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రెండో ఓటమితో లక్నో టీమ్ 4వ స్థానంలో కొనసాగుతోంది