Current Date: 20 Jun, 2026

ఐపీఎల్‌లోకి మళ్లీ యువరాజ్ సింగ్.. ఢిల్లీ టీమ్ మాస్టర్ ప్లాన్!

భారత మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన ఢిల్లీ యాజమాన్యం, ఈసారి 14 పాయింట్లతో ఆరో స్థానానికే పరిమితం కావడంతో కోచింగ్ బృందంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే వేణుగోపాల్ రావు, హేమాంగ్ బదాని, మునాఫ్ పటేల్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. యువరాజ్ సింగ్‌కు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలకు ఆయన వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో రిషబ్ పంత్ ఫామ్ కోల్పోయిన సమయంలోనూ యువీ అందించిన సలహాలు కీలక పాత్ర పోషించాయి. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లలో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచిన యువరాజ్, ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 2019లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, లక్నో జట్టును వీడడం ఖాయంగా కనిపిస్తున్న రిషబ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి ఢిల్లీ యాజమాన్యం తీవ్ర ఆసక్తి కనబరుస్తోంది. ఈ సీజన్‌లో లక్నో పేలవ ప్రదర్శన కారణంగా పంత్ తన కెప్టెన్సీని కోల్పోయిన సంగతి తెలిసిందే.