Current Date: 01 Mar, 2026

విశాఖ సైబర్ నేరగాడు అరెస్ట్.. 500 సిమ్ కార్డులు

విశాఖపట్నం కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. కంబోడియాలో ఉంటూ మ్యాట్రిమోనియల్, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అమాయకులను ముంచేస్తున్న విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్‌ను చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం విశాఖలోని ఓ కన్సల్టెన్సీ ద్వారా కంబోడియా వెళ్ళిన ఇతడు, అక్కడ సైబర్ ముఠాలో చేరి భారతీయులనే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మోసగాడికి అవసరమైన వనరులన్నీ విశాఖ నుంచే సమకూరడం గమనార్హం. నిందితుడు తన స్థానిక పరిచయాల ద్వారా విశాఖపట్నం నుంచి సుమారు 400 నుంచి 500 అక్రమ సిమ్ కార్డులను సేకరించాడు. వీటి సహాయంతో సోషల్ మీడియా మరియు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, యువతిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటాననే హామీతో బాధితులకు గాలం వేసేవాడు. మాటలనే పెట్టుబడిగా పెట్టి నమ్మకం కుదిరాక, నకిలీ క్రిప్టో ట్రేడింగ్ వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టించి లక్షలాది రూపాయలు కాజేసేవాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి ఏకంగా రూ. 11 లక్షలు దోచుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడి మూలాలను విశాఖలో గుర్తించారు. విశాఖలోని ఇతడి సహచరులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రసన్నకుమార్‌ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. విదేశాల్లో ఉంటూ సొంత ప్రాంతం నుంచే సిమ్ కార్డులు తెప్పించుకుని సాగిస్తున్న ఈ మాఫియా తీరు చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.