ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వంపై ఓ పాడ్‌కాస్ట్‌లో వెలువడిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక బ్రాండ్ వ్యూహకర్త కావేరీ బారువా.. అల్లు అర్జున్ను కలవాలంటే కళ్లలోకి చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని.. ఇలా మొత్తం 42 కఠినమైన నిబంధనలు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందిస్తూ.. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని కొట్టిపారేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ అందరితో ఎంతో గౌరవంగా, హుందాగా మెలుగుతారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ వివాదం ముదరడంతో సోషల్ మీడియాలో సదరు వ్యూహకర్తతో పాటు ఇంటర్వ్యూ చేసిన హోస్ట్ స్వీకృతిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆ పాడ్‌కాస్ట్ వీడియోను అన్ని వేదికల నుంచి తొలగిస్తున్నట్లు స్వీకృతి ప్రకటించారు. అయితే, వీడియోను తొలగిస్తూనే తన గెస్ట్పై, తనపై ‘పీఆర్’ యంత్రాంగం ద్వారా వేధింపులు జరుగుతున్నాయంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ 42 షరతులు ఇవేనంటూ ఒక ఫేక్ లిస్ట్ కూడా ప్రత్యక్షమవ్వడం పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టింది. బన్నీ టీమ్ ఈ ఫేక్ లిస్ట్ వ్యవహారాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంది. ఆ తప్పుడు లిస్ట్‌ను సృష్టించిన వ్యక్తిని ఇప్పటికే గుర్తించామని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కొందరు కుట్రపూరితంగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మేనేజ్మెంట్ హెచ్చరించింది.
Share