దుబాయ్‌లో భారత సంతతికి చెందిన కామిని కన్నన్ అనే మహిళ ఒక వివాహ వేడుక కోసం సుమారు రూ. 12 లక్షల విలువైన 50 గ్రాముల బంగారు కడ్డీని, నాలుగు బంగారు నాణేలను ఒక చిన్న పౌచ్‌లో ఉంచి డైనింగ్ టేబుల్‌పై పెట్టారు. అయితే, ఇల్లు శుభ్రం చేసే క్రమంలో ఆమె కుమారుడు ఆ పౌచ్‌ను చెత్తగా భావించి పొరపాటున చెత్తబుట్టలో పడేశారు. మరుసటి రోజు బంగారం కనిపించకపోవడంతో ఆ కుటుంబం కంగారుపడి, అది అప్పటికే మున్సిపల్ చెత్త లారీలోకి వెళ్లిపోయిందని తెలిసి ఆశలు వదిలేసుకున్నారు. అదృష్టవశాత్తూ చెత్తను వేరు చేస్తున్న సమయంలో ఒక పారిశుధ్య కార్మికుడికి ఆ బంగారు పౌచ్ లభించింది. ఏమాత్రం ఆశపడకుండా ఆ కార్మికుడు వెంటనే దానిని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. దుబాయ్ పోలీసులు తమ వద్ద ఉన్న అత్యాధునిక 'వేస్ట్ ట్రాకింగ్ సిస్టమ్' సాంకేతికతను ఉపయోగించి, ఆ పౌచ్ ఏ భవనం నుంచి, ఏ ప్రాంతం నుంచి వచ్చిందో నిశితంగా పరిశీలించి బాధితులను గుర్తించారు. కేవలం మూడు రోజుల్లోనే పోయిందనుకున్న రూ. 12 లక్షల విలువైన బంగారం తిరిగి చేతికందడంతో కామిని కన్నన్ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "ఇక బంగారం తిరిగి రాదని అనుకున్నాం, కానీ దుబాయ్ పోలీసుల వ్యవస్థ, కార్మికుల నిజాయితీ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది" అని వారు కృతజ్ఞతలు తెలిపారు.