Current Date: 26 Nov, 2024

ఫార్మాసిటీలో ఒక్క పూట ఫార్మాలిటీ రూ. 25 లక్షలు

ఆయన చొక్కా జేబు మీది మూడు రంగుల బ్యాడ్జీ ని చూస్తే  అసలు సిసలు భారతీయుడు అనుకుంటారు. కానీ అసలు రూపం చూస్తే ముక్కు పిండి లంచం వసూలు చేసే నూరణాల అవినీతి తిమింగలం. ఎవరా అని ఆలోచించాల్సిన పనిలేదు. గురువారం పరవాడ ఫార్మాసిటీలో తిష్ట వేసి కలెక్షన్‌ చేసుకున్న ఈ అధికారి పేరు ఏ.గణేషన్‌. ఉద్యోగం డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌. ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించుకుని రెండు నెలల క్రితమే విశాఖలో పోస్టింగ్‌ వేయించుకున్న అధికారి. ఎన్నికలయ్యే లోపున కోట్లాది రూపాయలు కొట్టేసి వెళ్ళిపోవాలన్న ప్లాన్‌తో ఇక్కడ పరిశ్రమల్ని దడదడ లాడిస్తూ ఒంటి చేత్తో లక్షలకు లక్షలు లాగేస్తున్న లంచావతారం. గురువారం ఈ లంచాధికారి దృష్టి పరవాడ ఫార్మా సిటీ మీద పడిరది. అంతే తన అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి అద్దె కారు (తెల్ల స్విఫ్ట్‌ డిజైర్‌ ఏపీ39 యూఆర్‌ 5071)లో ఫార్మాసిటీకి వెళ్లారు. కారును కాస్త దూరంగా పార్క్‌ చేయించి తను మాత్రం నడిచి వెళ్లి ఒక ఫార్మా కంపెనీలో తిష్ట వేశారు. ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ ఫోన్‌ నుంచే మిగిలిన కంపెనీల హెచ్‌ఆర్‌లకు ఫోన్‌ చేసి 25 వేల రూపాయలు పట్టుకురావాలని హుకుం జారీ చేశారు. ఫార్మా సిటీలో దాదాపు వంద కంపెనీలు వున్నాయి. ఒక్కో కంపెనీ పాతికవేల రూపాయలిస్తే అయ్యగారి కలెక్షన్‌ పాతిక లక్షల రూపాయలు. ఇవ్వకపోతే ఏ కేసు రాసేస్తారోనన్న భయంతో ఒక్కొక్కరు వచ్చి సొమ్ము చెల్లించుకొని వెళ్లారు . లంచం వసూలు చేయడంలో ఎటువంటి జంకూ బొంకూ లేకుండా హెచ్ఆర్ ఫోన్ నుంచే మాట్లాడి ఒక్క రోజులో పాతిక లక్షలు  సంపాదించగాలిగాడు ఈ అధికారి.చూశారా?కొమ్ములు తిరిగిన పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడి లేకుండా ఒక్క పూటలో పాతిక లక్షలు సంపాదించలేరు. ఈ అధికారి మాత్రం అద్దెకారులో వెళ్లి పారిశ్రామికవేత్తల్ని అదరగొట్టి దర్జాగా  ఒక్క పూటలో పాతిక లక్షల రూపాయలు కాజేయడం ఫార్మాసిటీలో  మెగా ఫార్మాలిటీ అంటూ హాట్‌టాపిక్‌గా మారింది.