Current Date: 12 Feb, 2026

పిల్లోడు అల్లరి చేస్తున్నాడని కన్నుపోయేలా కొట్టిన అంగన్‌వాడీ టీచర్!

తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ఒక అంగన్‌వాడీ టీచర్ అమానుషంగా ప్రవర్తించారు. అల్లరి చేస్తున్నాడనే సాకుతో మూడున్నరేళ్ల చిన్నారి విద్వాన్ష్‌ను టీచర్ రాణి విచక్షణారహితంగా చితకబాదారు. ఈ దాడిలో బాలుడి కుడి కన్ను తీవ్రంగా ఉబ్బిపోవడమే కాకుండా, కాళ్లు, చేతులు, వీపుపై వాతలు తేలి తీవ్ర గాయాలయ్యాయి. అక్షరాలు నేర్పించాల్సిన చేతులే పసివాడిపై ప్రతాపం చూపడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాలుడికి జ్వరం వచ్చిందని తల్లి లక్ష్మికి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లమని టీచర్ చెప్పగా, అక్కడకు వెళ్లిన తల్లికి చిన్నారి పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయింది. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. టీచర్ రాణి ఉద్దేశపూర్వకంగానే తమ బిడ్డను గాయపరిచిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సీడీపీవో ఉమారాణి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ జరిపారు. సదరు టీచర్ నుంచి వివరణ కోరిన అధికారులు, ఆమెపై తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.