Current Date: 12 Feb, 2026

బెయిల్ వచ్చినా విడుదలవ్వని అంబటి.. ఊహించని ట్విస్ట్!

వైకాపా కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ కేసుల ఉచ్చు మరింత బిగుస్తోంది. గుంటూరులో పోలీసులపై దౌర్జన్యం చేశారన్న కేసులో బుధవారం ఆయనకు బెయిల్ లభించడంతో విడుదలవుతారని భావించిన తరుణంలో, కోర్టు మరో షాక్ ఇచ్చింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరిట సాగించిన అక్రమ వసూళ్ల కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 18వ తేదీలోగా ఆయన్ను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అంబటి జైలు నుంచి విడుదల కాకుండానే మళ్లీ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2023 జనవరిలో అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న సమయంలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దీనికోసం నియోజకవర్గంలోని వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల సొమ్ము నుంచి రూ.200 చొప్పున కోత విధించి, బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది చట్టవిరుద్ధమని, పేదల పింఛను డబ్బులతో లాటరీ నిర్వహించడం నేరమని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో సత్తెనపల్లి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ పాత కేసే ఇప్పుడు అంబటిని కోర్టు మెట్లు ఎక్కించేలా చేసింది. వరుసగా కేసులు నమోదు కావడంతో అంబటి రాంబాబు ఇటు రాజకీయంగా, అటు న్యాయపరంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు, పోలీసులపై దౌర్జన్యం కేసుల్లో అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు, బెయిల్ వచ్చిన వెంటనే మరో వారెంట్ అందడం వైకాపా శ్రేణులను నిరాశకు గురిచేసింది. పోలీసుల దౌర్జన్యం కేసులో బెయిల్ పత్రాలతో జైలుకు వెళ్లిన న్యాయవాదులకు, కొత్త వారెంట్‌తో పోలీసులు అక్కడే ఉండటంతో రాంబాబు విడుదల నిలిచిపోయి తిరిగి జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది.