Current Date: 13 Feb, 2026

జుట్టు పొట్టిగా కత్తిరించారని సెలూన్‌పై కేసు.. రూ.25 లక్షలు పరిహారం!

లగ్జరీ హోటల్ సెలూన్‌లో హెయిర్‌కట్ సరిగ్గా చేయలేదన్న కారణంతో వినియోగదారుల కమిషన్ విధించిన భారీ జరిమానాపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో 2018లో ఆశ్నారాయ్ అనే మోడలింగ్ ప్రొఫెషనల్ హెయిర్‌కట్ చేయించుకోగా, సిబ్బంది ఆమె కోరినదాని కంటే జుట్టును బాగా పొట్టిగా కత్తిరించారు. దీనివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, మోడలింగ్ అవకాశాలు కోల్పోయానని ఆమె జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌‌ను ఆశ్రయించగా, కమిషన్ ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని హోటల్‌ను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐటీసీ హోటల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో సేవాలోపం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన కోర్టు, కేవలం బాధితురాలు సమర్పించిన ఫోటోల ఆధారంగానే రూ.2 కోట్ల భారీ పరిహారం నిర్ణయించడం సరికాదని అభిప్రాయపడింది. వినియోగదారుల వివాదాల్లో పరిహారం అనేది ప్రత్యక్ష సాక్ష్యాలు, విశ్వసనీయమైన ఆధారాలపై ఆధారపడి ఉండాలి తప్ప, బాధితులు అడిగారని లేదా ఇష్టానుసారంగా భారీ మొత్తాలను ప్రకటించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఎన్‌సీడీఆర్‌సీ విధించిన రూ.2 కోట్ల పరిహారాన్ని సుప్రీంకోర్టు రూ. 25 లక్షలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. పరిహారం కోట్లలో ఉన్నప్పుడు సహేతుకమైన కారణాలు ఉండాలని, ఈ కేసులో అంత భారీ మొత్తానికి తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. 2018లో మొదలైన ఈ వివాదం సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఒక కొలిక్కి వచ్చింది. సేవాలోపాలకు బాధ్యత వహించాల్సిందే కానీ, పరిహారం మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండాలని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం నొక్కి చెప్పింది.