Current Date: 08 Nov, 2024

భారత్‌కి పాకిస్థాన్ ఫైనల్ వార్నింగ్.. వచ్చి ఆడతారా లేదా?

పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.2008 తర్వాత భారత క్రికెట్‌ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి.వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Share