తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆమె చేసిన ట్వీట్‌పై విమర్శల వర్షం కురుస్తున్నా.. మేడమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? అని గత ఆదివారం ట్విట్టర్‌లో ఆమె పోస్టు పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే.. తాను చేసిన కామెంట్లను ఆమె సమర్థించుకున్నారు.ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌తో పాటు డిఫెన్స్ వంటి కొన్ని రంగాల్లో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌లలాగే ఐఏఎస్‌లు అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా తాను హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. తన మనసులో సున్నితత్వానికి స్థానం లేదని మరోసారి ట్వీట్ చేశారు. కాగా, స్మితా సబర్వాల్ ట్వీట్లపై సివిల్స్ ర్యాంకర్, మెంటార్ బాలలత స్పందించారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మితా సభర్వాల్‌కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలన్నారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతుందన్నారు. అసలు ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందో చెప్పాలన్నారు.
Share