ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై రెండు రోజులపాటు విచారణ జరిపిన సిట్.. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ చేపట్టింది. కొన్ని సెక్షన్లు మార్పుపై సిఫారసులు చేసిన అధికారులు.. కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అంశంపైనా కొంత సమాచారం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కొందరు అధికారులు హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా ఆలస్యంగా వెళ్లినట్లు, స్థానిక రాజకీయ నేతలతో కుమ్మక్కైనట్లు సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజీపీ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును పూర్తి చేసి నివేదికను ఇచ్చింది. దీంతో ఈ నివేదికను సీఈసీ, ఎన్నికల సంఘం సీఈవోకు డీజీపీ అందజేయనున్నారు. సిట్ తన దర్యాప్తు సందర్భంగా పలువురు నేతలు, స్థానికులు, పోలీసులను విచారించడంతో పాటు ఆయా ఘటనల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సైతం పరిశీలించింది.
Share