పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్య శ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని, ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నామని పేర్కొంది.
ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం రూ.50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. రూ.530 కోట్ల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటివరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది.