Current Date: 14 Feb, 2026

అమెరికాలో జాహ్నవి కేసు.. ఆదోనిలో ఫ్యామిలీకి రూ.262 కోట్లు పరిహారం!

అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో సియాటెల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల అంటే భారత్ కరెన్సీలో సుమారు రూ.262.75 కోట్లు పరిహారం చెల్లించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిహారం ఆ కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2023 జనవరిలో మాస్టర్స్ చదువుతున్న జాహ్నవి రోడ్డు దాటుతుండగా, గంటకు 120 కి.మీ వేగంతో పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆ సమయంలో ఒక పోలీసు అధికారి ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తూ చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డై ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. దీంతో సదరు అధికారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా, సియాటెల్‌ నగరంపై బాధితురాలి కుటుంబం న్యాయపోరాటం చేసింది. దురదృష్టవశాత్తు, ఈ పరిహారం ప్రకటన వెలువడడానికి సరిగ్గా మూడు రోజుల ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్‌ గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమార్తె మరణం కలిగించిన తీవ్ర ఆవేదనతోనే ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మార్చి నెలలో అమెరికాకు రావాలని అక్కడి అధికారులు పిలుపునివ్వగా, తండ్రి మరణం మరియు తాజాగా అందిన భారీ పరిహారం వార్తతో ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.