Current Date: 06 Mar, 2026

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. ఒకేసారి 250 బాంబులు!

అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దళాలు ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన దాడులు ఐదో రోజుకు చేరాయి. తెల్లవారుజామున రాజధాని టెహ్రాన్‌లోని సైనిక ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలతో ఏకకాలంలో 250 బాంబులు కురిపించింది. ఈ భీకర దాడుల్లో ఇప్పటివరకు సుమారు 1,045 మంది మరణించినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ వైమానిక దళానికి చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని తమ ఎఫ్-35 కూల్చివేసిందని ఇజ్రాయెల్ ప్రకటించగా, టెహ్రాన్ శివార్లలోని రహస్య అణ్వస్త్ర కేంద్రం కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రం, దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని బాలిస్టిక్ క్షిపణులను నాటో దళాలు గాలిలోనే అడ్డుకోగా, జెరూసలేం వంటి నగరాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియాలోని ఆర్థిక, సైనిక వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం మధ్యలోనే ఇరాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంటోంది. సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తదుపరి అత్యున్నత నేతగా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ, ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా వారిని లక్ష్యంగా చేసుకుంటామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో మొత్తం ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారింది.