Current Date: 03 Mar, 2026

టీ20 ప్రపంచకప్‌‌లో భారత్‌ను ఒంటిచేత్తో సెమీస్‌కి చేర్చిన శాంసన్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, ఛేజ్ 40 పరుగులు, హోల్డర్ 37 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీసినప్పటికీ, చివరి ఓవర్లలో వెస్టిండీస్ బ్యాటర్లు విరుచుకుపడటంతో భారత్‌ ముందు 196 పరుగుల కఠిన లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే నిష్క్రమించినా, సంజు శాంసన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి భారత్ జట్టుని ఒంటిచేత్తో గెలిపించాడు. ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయే స్థితి నుంచి, ఒత్తిడిలో అమోఘమైన బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతడికి తోడుగా తిలక్ వర్మ 27 పరుగులు చేయడంతో భారత్ రేసులో నిలిచింది. శాంసన్ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, ఇన్నింగ్స్ ఆద్యంతం అజేయంగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్య అవుటైనా, శివమ్ దూబె రెండు ఫోర్లతో ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్లో సంజు శాంసన్ వరుసగా సిక్స్, ఫోర్ బాది 19.2 ఓవర్లలోనే భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తనపై ఉన్న విమర్శలన్నింటికీ ఈ ఇన్నింగ్స్‌తో సమాధానమిచ్చిన శాంసన్, కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుని భారత జట్టుకు నిజమైన 'ఆపద్బాంధవుడు' అని నిరూపించుకున్నాడు.