టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన మరుసటి రోజే టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఒక సాహసమే చేశాడు. ముంబైలోని తన పిల్లల దగ్గరకు త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో, విమాన టికెట్లు దొరక్కపోవడంతో అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. ఎవరైనా గుర్తిస్తే ఇబ్బంది అవుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ, సమయం ఆదా అవుతుందని థర్డ్ ఏసీలో టికెట్లు బుక్ చేసుకుని తన భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ప్రయాణమయ్యాడు. అభిమానుల కంట పడకుండా ఉండేందుకు దూబే మాస్క్, క్యాప్ ధరించి జాగ్రత్త పడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకే స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ అక్కడ భారత జెర్సీల్లో చాలా మంది అభిమానులు కనిపించడంతో, రైలు కదలడానికి ఐదు నిమిషాల ముందు మాత్రమే తన బెర్తు వద్దకు వెళ్లాడు. రైలెక్కిన తర్వాత ఎవరూ గుర్తించకుండా పైబెర్తుపై పడుకున్నాడు. టికెట్ చెకింగ్ సమయంలో టీసీకి అనుమానం వచ్చి అడగగా.. "అంత పెద్ద క్రికెటర్ ఇక్కడికి ఎందుకు వస్తారు?" అని ఆయన భార్య తెలివిగా బదులిచ్చి విషయాన్ని దాటవేసింది. అయితే, ముంబైలోని బోరివలి స్టేషన్‌లో దిగే సమయంలో జనం గుర్తుపడితే ఇబ్బంది తలెత్తుతుందని భావించిన దూబే, ముందుగానే పోలీసుల సహాయం కోరారు. భారత క్రికెటర్ రైలు స్టేషన్‌కు వస్తున్నారని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. చివరకు పోలీసుల భద్రత నడుమ ఆయన సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నారు. ప్రపంచకప్ గెలిచినంతటి స్టార్ డమ్ ఉన్నా, సామాన్యుడిలా రైల్లో ప్రయాణించి పిల్లల దగ్గరకు వెళ్లాలన్న ఆయన తపనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.