పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తన కుమారుడు ఎన్.క్రిష్ ధరణ్‌రెడ్డిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపే రోజుల్లో.. ఒక ఉన్నతాధికారి అయి ఉండి కూడా తన బిడ్డను ప్రభుత్వ బడికి పంపించడం విశేషం. ఈ విద్యార్థి అంతకుముందు విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం కలెక్టర్ ప్రభాకరరెడ్డి తన కుమారుడిని పార్వతీపురంలోని 'డాక్టర్ దిండిగల్ వెంకట్‌రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాల'లో పదో తరగతిలో చేర్పించారు. ఒక జిల్లా మేజిస్ట్రేట్ స్థాయి అధికారి కుమారుడు తమ బడిలో చేరడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ పేర్కొన్నారు. కాగా, గతంలో ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివించడం గమనార్హం.