తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు చోరీకి పాల్పడటం, వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది.
రైలులోని ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దుండగులు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించారు. అనంతరం చైన్ లాగడంతో రైలు అక్కడే నిలిచిపోయింది. దొంగతనం చేసిన అనంతరం ఆరుగురు దుండగులు రైలు దిగి పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా.. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని నిలువరించేందుకు ఏకంగా 9 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ దొంగలు పరారయ్యారు.
గత రెండు నెలల వ్యవధిలోనే కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి వరుస చోరీలు జరగడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళల నుంచి 130 గ్రాముల బంగారం దోచుకెళ్లగా.. మూడు వారాల క్రితం నిడుబ్రోలు సమీపంలో సిగ్నల్స్ టాంపరింగ్ చేసి చోరీకి యత్నించారు.