వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్‌కు చెందిన వి.వినయ్ అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. తనతోపాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు బానిసలై బోల్డంత డబ్బు నష్టపోయినట్టు గుర్తించాడు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ పలువురు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు 3, 3ఎ, 4తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66డీ, బీఎన్ఎస్ లోని సెక్షన్ 318(4) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీచేసి విచారించనున్నారు.
Share