గ్రూప్-1 పరీక్షలను అభ్యర్థులు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఉన్నారు. ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పరీక్షలో వచ్చి కొన్ని ప్రశ్నలకు తికమకపడి ఏం రాయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు.అంత క్లిష్టతరమైన పరీక్షలను ఓ అభ్యర్థి కాపీ కొట్టి పాసవ్వాలనుకున్నారు. పైగా ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడం మరింత విస్తుగొలిపే అంశం. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీయింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు.ఇస్లావత్ లక్ష్మీ అనే అభ్యర్థి తన చీర కొంగులో చిట్టీలు కట్టుకొని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చిట్టీలు చూస్తూ పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. కాపీయింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా ఇస్లావత్ లక్ష్మీ పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం వనపర్తి జిల్లా పెద్దమామిడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం అని తెలుస్తోంది. టీజీపీఎస్‌ఈ నిబంధనల ప్రకారం లక్ష్మిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Share