Current Date: 26 Nov, 2024

ముస్లిం రిజర్వేషన్ అనే మాటే తప్పు.. ఏది కరెక్ట్ అంటే..?

ఏపీ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాంటున్న బీజేపీ అగ్రనేతల మాటలు కూటమిని ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వైఖరి మరోసారి స్పష్టం చేశారు.

ఏపీ ఎన్నికలకు మరో మూడ్రజులు సమయం ఉంది. రాష్ట్రంలో ప్రచారం పీక్స్ కు చేరుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. పలు సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోదీ తదితరులు చేసిన వ్యాఖ్యలు కూటమికి ఇబ్బందిగా మారాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వైఖరిని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ముస్లింలకు రిజర్వేషన్లు విషయంలో తాను నిలబడతానన్నారు. ఎవరు ఎలా తొలగిస్తారో చూస్తానని జగన్ స్పష్టం చేశారు. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో జతకట్టి చంద్రబాబు పెద్ద తప్పు చేశారన్నారు. చంద్రబాబుకు ముస్లింపై నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే..ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెప్పినప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారు. అసలు ముస్లిం రిజర్వేషన్లు అనే పదమే తప్పని చెప్పారు. ఇది ముస్లింలలో వెనుకబడివారికి ఇస్తున్న రిజర్వేషన్ మాత్రమేనన్నారు. ముస్లింలలో కూడా చాలామందికి 4 శాతం రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మతం ప్రాతిపదికగా ముస్లింలకు కల్పించే రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. వెనుకబడినవారు ప్రతి మతంలోనూ ఉంటారని, హిందూవుల్లో కూడా బీసీలున్నారని చెప్పారు.

ఇక బీజేపీ విషయంలో తనకు ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యతిరేకించాలో అక్కడ వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు అనుగుణంగా ఉంటున్నామన్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల విషయంలో సయోధ్యతో ఉంటున్నామన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలనేదే తన ఆలోచన అన్నారు.