ఈరోజుల్లో మెట్రో సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి కూడా ర్యాపిడో లేదా ఓలా బైక్ బుక్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఓ 16 ఏళ్ల బాలిక ర్యాపిడో డ్రైవర్ మాటల్ని నమ్మి నిండా మోసపోయింది.సెలవుల సీజన్ నడుస్తుండటంతో.. చాలా మంది పిల్లలు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే.. సికింద్రాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక.. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండగా.. ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఆమాత్రానికే.. అలిగిన ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేదింది. ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న బాలికను గమనించిన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి.. ఆమెను పలకరించాడు. ఆమె బాధలో ఉందని గమనించి.. అదే అలుసుగా మెల్లిగా మాట కలిపాడు. నాలుగు ఓదార్పు మాటలు చెప్పేసరికి.. ఆమెకు కొంత సాంత్వనం దొరికినట్టయింది. దీంతో.. సందీప్ రెడ్డిని ఆ బాలిక నమ్మింది.రోడ్డుపై ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని.. నీ కోపం తగ్గేవరకు తను ఓ సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తానని చెప్పటంతో.. సందీప్ రెడ్డి మీద మరింత నమ్మకం కుదిరింది. సందీప్ రెడ్డి మాటల్లోని దురుద్దేశం తెలుసుకోలేకపోయిన బాలిక.. బైక్ ఎక్కింది. దీంతో.. ఆమెను కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు సందీప్ రెడ్డి. తీరా లాడ్జ్‌కి తీసుకెళ్లిన సందీప్ రెడ్డి.. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో.. ఆ బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదుచేశారు.