ముంబయి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నగరంలో 44 మి.మీల వర్షపాతం నమోదు కాగా.. తూర్పు సబర్బన్ ప్రాంతంలో 90 మి.మీ, పశ్చిమ సబర్బన్‌లో 89 మి.మీల వర్షపాతం నమోదైంది. దాంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రాయ్‌గఢ్-పుణె మార్గంలోని కొండచరియ విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటితో సిటీ మొత్తం జలమయంగా మారింది. దాంతో పలు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో జాప్యానికి కారణమవుతోందని, విమానాశ్రయాలకు బయల్దేరేముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. స్పైస్‌జెట్ నుంచి కూడా ఇదేతరహా ప్రకటన వచ్చింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో వరద నీటి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో రెండు ఉప్పొంగుతున్నాయి. సాయన్, చెంబూర్, అంధేరీ ప్రాంతాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. అంధేరీ సబ్‌వే ద్వారా రాకపోకలను నిలిపివేశారు. పుణె, చించ్వాడ ప్రాంతాల్లోనూ భారీగా వరద నీరు చేరింది. ఖదక్ వాస్ల డ్యామ్‌లో భారీ నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పుణె కలెక్టర్ సుహాస్ దివాసే వెల్లడించారు.
Share