Current Date: 27 Nov, 2024

టీచర్ అవతారమెత్తిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంతులమ్మ అవతారమెత్తారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే రాష్ట్రపతి ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్‌లో ఉన్న డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్‌ – బీలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ముర్ము.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా పాఠశాలలో అందుతున్న విద్య, ఇతర సౌకర్యాల గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25వ తేదీన ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు కూడా కావడం విశేషం. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె ఝార్ఖండ్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. గతంలో 1994-97 మధ్య రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ఆమె గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేశారు.

Share