Current Date: 05 Oct, 2024

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది.ముఖ్యంగా, అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్రపై వారు చర్చించారు. అమెరికాలో నివసిస్తున్న, ఉద్యోగాలు పొందుతున్న తెలుగువారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వారు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం పొందారు.ఇక సులభతరమైన వీసా విధానాలపై కూడా చర్చ జరిగింది. అమెరికా వెళ్లడానికి వీసా పొందడం కొంత మంది భారతీయులకు సవాలుగా మారుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పని చేయాలన్న అంశంపై వివరమైన చర్చలు జరిగాయి. విద్య, వాణిజ్య, పరిశ్రమలలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత గాఢతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాల పరిరక్షణకు అవసరమైన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Share