కరూర్ తొక్కిసలాట ఘటన బాధితులకు ఉద్యోగాలు కల్పించే వ్యవహారంలో విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధితుల కుటుంబాలకు నియామకాలు చెల్లవంటూ గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత పిటిషన్‌దారులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ వ్యాజ్యదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘తొక్కిసలాట లాంటి దురదృష్టకర సంఘటన జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? సంపాదించే ఇంటిపెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబంలోని కుమారుడికి లేదా కుమార్తెకు ఉపాధి కల్పించకూడదా? ప్రభుత్వ సంక్షేమ విధానాల్లో రాజకీయాన్ని తీసుకురావద్దు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు ఎన్నికల ప్రచారం సమయంలో టీవీకే పార్టీ ర్యాలీలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం విజయ్ ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. అయితే, ‘ప్రభుత్వ ఉద్యోగాలను ఉచితంగా ఇవ్వలేరని, ఇది ఇతరులకు అన్యాయం చేస్తుందంటూ’ జులైలో మద్రాసు హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేయడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో బాధితులకు ఊరట లభించినట్లయింది.