సైబర్ నేరగాళ్ల నకిలీ సందేశాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం పేరుతో వచ్చే మోసపూరిత మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఓటరు కార్డు వివరాలు తిరస్కరణకు గురయ్యాయని నమ్మబలికే వ్యాఖ్యలతో వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మీ ఓటరు కార్డు వివరాలు రికార్డులతో మ్యాచ్ కావడం లేదు, ఎన్యూమరేషన్ ఫారం రిజెక్ట్ అయింది' అంటూ లింక్‌లు పంపిస్తూ.. రూ. 5 చెల్లించి వివరాలు అప్‌డేట్ చేసుకోవాలనే మెసేజ్‌లు పూర్తిగా ఫేక్ అని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఈసీఐ లేదా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎలాంటి లింకులు పంపరని, డబ్బులు కూడా డిమాండ్ చేయరని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి నకిలీ సందేశాలు, కాల్స్‌కు స్పందించి ఓటింగ్ వివరాల కోసం వ్యక్తిగత లేదా బ్యాంకు ఖాతా సమాచారాన్ని, పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని కోరింది. ఓటరు నమోదు, నమోదు స్థితి లేదా నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం సరిచూసుకోవడానికి లేదా ఓటరు సేవలు పొందడానికి భారత ఎన్నికల సంఘం నడుపుతున్న National Voters' Service Portal వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.