పోలీసులే చేతులెత్తేసిన కేసులో ఒక పట్టుచీర దొంగను పట్టించిన ఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడజాగీర్ వినాయక్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి ఎం.యాదయ్య ఇంట్లో మూడేళ్ల క్రితం భారీ చోరీ జరిగింది. పిల్లల వైద్యం కోసం కుటుంబంతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో దొంగలు పడ్డారు. మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన యాదయ్య, రూ.2.50 లక్షల నగదుతో పాటు 9 తులాల బంగారు ఆభరణాలు, ఓ విలువైన పట్టుచీర చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఆ కేసును మూసివేశారు. కానీ.. ఇటీవల యాదయ్య భార్య హాజరైన ఒక శుభకార్యానికి, వారి ఇంటికి సమీపంలో ఉన్న స్వప్న చోరీకి గురైన తన పట్టుచీరనే ధరించి వచ్చింది. ఆ చీరను వెంటనే గుర్తుపట్టిన యాదయ్య భార్యకు.. అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదుతో మళ్లీ విచారణ చేపట్టిన పోలీసులు స్వప్నను, ఆమె భర్త బుగ్గ రాములును అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం ఒప్పుకున్నారు. దంపతుల నుంచి 8.7 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దంపతులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంట్లోని వస్తువుల విషయంలో మహిళ మెమరీ పవర్‌కి ఈ ఘటన అద్దం పడుతోంది.