స్టార్ హీరోలు ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. అదే తరహాలో రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఓ చిన్న మార్పు కూడా ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత ప్రభాస్ మొదటిసారి తన ప్రొఫైల్ ఫొటోను మార్చడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లూ తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘బాహుబలి’ చిత్రంలోని ఫొటోనే ఆయన డీపీగా కొనసాగించారు. ఆ తర్వాత సలార్, కల్కి వంటి భారీ హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ ప్రభాస్ తన ప్రొఫైల్ పిక్‌ను మార్చలేదు. అయితే ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన కొత్త స్టిల్‌ను డీపీగా పెట్టడం విశేషం. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల ప్రభాస్‌కు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు హను రాఘవపూడి పీరియాడిక్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపై ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ మార్పు సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.