Current Date: 12 Feb, 2026

చంద్రబాబుని మళ్లీ ఇరికించేసిన రేవంత్ రెడ్డి.. శిష్యుడితో చిక్కులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మరోసారి రాజకీయంగా ఇరుకున పెట్టాయి. గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోవడానికి చంద్రబాబుతో తాను జరిపిన చర్చలే కారణమని రేవంత్ అసెంబ్లీలో ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. తాజాగా హైదరాబాద్‌కు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్టును మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి చంద్రబాబు తరలించారన్న రేవంత్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఏపీకి వస్తున్న ప్రాజెక్టులన్నీ తన ప్రతిభ, లోకేష్ కృషి వల్లనే వస్తున్నాయని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రకటన ఆయన ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఉంది. ఒకవేళ రేవంత్ మాటలను చంద్రబాబు నేరుగా ఖండించకపోతే, పొరుగు రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులను అడ్డదారుల్లో లాక్కున్నారనే అపవాదును ఆయన మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఏపీ ప్రజల్లో ఆయన ప్రతిభపై అనుమానాలు రేకెత్తించడమే కాకుండా, పరువు పోయే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు ఈ పరిణామం పెద్ద అడ్డంకిగా మారింది. రెండు రాష్ట్రాలు బాగుండాలని 'రెండు కళ్ల సిద్ధాంతాన్ని' వల్లిస్తున్న ఆయన, తెలంగాణ ప్రయోజనాలను కుట్రపూరితంగా దెబ్బతీశారనే ముద్ర పడితే అక్కడి ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుంది. తన ప్రియ శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి మాటలను ఖండించలేక, అలాగని మౌనంగా ఉంటే కుట్రను అంగీకరించినట్లవుతుందనే సందిగ్ధంలో చంద్రబాబు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.