Current Date: 12 Feb, 2026

అల్లు అర్జున్ 'వరల్డ్ క్లాస్' థియేటర్.. అతిపెద్ద స్క్రీన్‌తో రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, మల్టీప్లెక్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అమీర్‌పేట్‌లో ఏఏఏ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన బన్నీ, ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో 'అల్లు సినిమాస్‌' పేరుతో దేశంలోనే అత్యున్నత సాంకేతికత కలిగిన ప్రీమియం మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేశారు. మహేష్ బాబు ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్ ట్రెండ్‌ను అల్లు అర్జున్ ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. కోకాపేటలోని ఈ కొత్త మల్టీప్లెక్స్ అనేక ప్రత్యేకతలకు నిలయంగా మారింది. ఇక్కడ దేశంలోనే అతిపెద్దదైన 75 అడుగుల వెడల్పు గల డాల్బీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఇందులో పొందుపరిచారు. మొత్తం 4 స్క్రీన్‌లతో నిర్మితమైన ఈ మల్టీప్లెక్స్‌ను మార్చి 19న ఘనంగా ప్రారంభించేందుకు అల్లు సినిమాస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించబోయే తొలి సినిమాలపై కూడా భారీ ప్లాన్ సిద్ధమైంది. పాన్ ఇండియా చిత్రాలైన 'ధురంధర్ 2','టాక్సిక్' సినిమాలతో ప్రదర్శనలు ప్రారంభించాలని భావిస్తున్నారు. తద్వారా 'అల్లు సినిమాస్' బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనేది బన్నీ ఆలోచన. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలో కూడా మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించడం విశేషం.