ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం జిల్లా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ముందస్తు అంచనాల ప్రకారం, అటు జిల్లా స్థూల ఉత్పత్తి (GDDP)లోనూ, ఇటు తలసరి ఆదాయంలోనూ విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. విశాఖ తర్వాత స్థూల ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లా రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, తలసరి ఆదాయం పరంగా మాత్రం ఈ జిల్లా మూడో స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ. 2,94,507గా అంచనా వేయగా, ప్రాంతీయంగా తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కేవలం తొమ్మిది జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు ఆదాయం కంటే ఎగువన ఉండటం గమనార్హం. పారిశ్రామికంగా, సేవా రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాలు ముందంజలో ఉండగా, వ్యవసాయంపై ఆధారపడిన మిగిలిన జిల్లాలు సగటు ఆదాయాన్ని చేరుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వర్ణాంధ్ర @2047 విజన్‌లో భాగంగా రాబోయే కాలంలో అన్ని జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించి, రాష్ట్ర సగటు ఆదాయాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.