Current Date: 12 Feb, 2026

కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ పంచ్.. బి గ్రేడ్‌కి పడిపోయిన స్టార్స్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన పురుషుల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టులో సీనియర్ సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థాయిని బోర్డు ఈసారి తగ్గించింది. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో, గతంలో వీరికి ఉన్న అత్యున్నత విభాగం నుంచి గ్రేడ్ 'బి' కాంట్రాక్టుకు వీరిని పరిమితం చేశారు. గతంలో రూ.7 కోట్లు ఫీజుగా ఉండి, వీరికి మాత్రమే దక్కే 'ఎ+' గ్రేడ్‌ విభాగాన్ని బీసీసీఐ ఈసారి పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు ప్రకటించిన ఈ కాంట్రాక్టులలో.. రెండు ఫార్మాట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు మాత్రమే 'ఎ' గ్రేడ్‌ను దక్కించుకున్నారు. వివిధ గ్రేడ్‌ల కింద చెల్లించే ఫీజు వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించనప్పటికీ, గత సీజన్ ప్రకారం ఎ, బి, సి గ్రేడ్ ఆటగాళ్లకు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.1 కోటి చొప్పున పారితోషికం లభించే అవకాశం ఉంది. mమరోవైపు, సీనియర్ పేసర్ మహమ్మద్ షమి, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లకు ఈసారి సెంట్రల్ కాంట్రాక్టులలో చోటు దక్కలేదు. గత సీజన్‌లో వీరు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. యువ ఆటగాడు, తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి గ్రేడ్‌ 'సి' కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం విశేషం. సీనియర్ల గ్రేడ్‌లు తగ్గించి, నిలకడగా ఆడుతున్న యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేసింది.